
- రైతుల వద్ద నుంచి డ్రాగన్ ఫ్రూట్ నేరుగా కొనుగోలు చేసేలా కార్యాచరణ
- సోలార్ ప్యానల్ పంపు సెట్ల ఏర్పాటుకు చర్యలు
- కారేపల్లి మండలం చీమలపాడులో పర్యటన
కారేపల్లి, వెలుగు : ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తూ లాభదాయక పంటల సాగుపై రైతుల దృష్టి సారించాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. మంగళవారం మండలంలోని చీమలపాడు గ్రామంలో ఆయన పర్యటించారు. రైతు వెంకటేశ్వర్లు సాగు చేసిన పామాయిల్ పంటను, శ్రీనివాసరావుకు చెందిన డ్రాగన్ ఫ్రూట్ పంటను పరిశీలించారు. డ్రాగన్ ఫ్రూట్, ఆయిల్ పామ్ సాగు, విద్యుత్, ఇతర సమస్యలపై పంట పొలం వద్ద చెట్టు నీడన కింద కూర్చొని అడిగి తెలుసుకున్నారు. సాగునీటి వసతి ఎంత వరకు ఉంది, పంటల దిగుబడి, రైతులకు గిట్టుబాటు అవుతుందా లాంటి పలు అంశాలపై రైతులతో ముచ్చటించారు.
అటవీ ప్రాంతమైనందున విద్యుత్ కనెక్షన్లు పొలాలకు అధికంగా లేవని, సబ్సిడీతో పొలాల వద్ద మోటార్లకు సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. ఆయిల్ పామ్ సాగు వల్ల లాభాలు ఉంటాయని, అంతర్ పంటల ద్వారా మొదటి మూడేండ్లు మంచి ఆదాయం వస్తుందని, ఆయిల్ పామ్ పంట దిగుబడి ప్రారంభమైన తర్వాత సంవత్సరానికి లక్షలకు తగ్గకుండా రైతులు ఆదాయం సంపాదిస్తారని వివరించారు. డ్రాగన్ ఫ్రూట్ పంటకు కోతుల సమస్య ఉందని, సోలార్ ఫెన్సింగ్ వేయడం ద్వారా సమస్య పరిష్కారమయ్యే అవకాశాలు ఉంటాయని రైతులకు సూచించారు.
డ్రాగన్ ఫ్రూట్ రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసేలా చూడాలని వ్యవసాయ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. వేసవిలో పొలాల్లో మట్టి పరీక్షలు చేయాలని సూచించారు. అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఉపాధి హామీ కింద రైతుల పొలాల్లో నీటిగుంటలు ఏర్పాటు చేస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, తహసీల్దార్ సంపత్ కుమార్, ఎంపీడీవో సురేందర్, విద్యుత్ శాఖ ఏడీ ఆనంద్, ఉద్యానవన శాఖ అధికారి వేణు పాల్గొన్నారు.