![రైతులను ఇబ్బందులు పెట్టొద్దు..ఏ సమస్య ఉన్న నా దృష్టికి తేవాలి : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్](https://static.v6velugu.com/uploads/2025/02/collector-muzammil-khan-visited-gokinepalli-village-in-mudigonda-mandal_ZA6FmRXIgc.jpg)
ముదిగొండ/ఖమ్మం టౌన్, వెలుగు : రైతు భరోసా డబ్బులు జమ కాలేదన్న ఫిర్యాదులపై తప్పొప్పులను అధికారులే సరిచూసుకోవాలని, రైతులను ఇబ్బందులు పెట్టొద్దని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. మంగళవారం ముదిగొండ మండలం గోకినేపల్లి గ్రామంలో ఆయన పర్యటించి రైతులతో ముచ్చటించారు. రైతు రుణమాఫీ, సన్న రకం వడ్లకు బోనస్, ఇతర సమస్యలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రూ.2 లక్షల వరకు రుణాలు ఉన్న లక్ష 34 వేల మంది రైతులకు మాఫీ జరిగిందని తెలిపారు.
వివరాలు సరిగా లేక మాఫీ జరగని రైతుల సమాచారానిన వెంటనే సవరించాలని ఆయన లీడ్ బ్యాంక్ మేనేజర్‌ను ఆదేశించారు. కాగా జిల్లాలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఖమ్మంలో అడిషనల్ కలెక్టర్ శ్రీజతో కలిసి ఆన్ లైన్ ద్వారా పోలింగ్ సిబ్బంది మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు.