రైతులను మోసం చేస్తే చర్యలు : కలెక్టర్​ ముజామ్మిల్​ ఖాన్​

రైతులను మోసం చేస్తే చర్యలు : కలెక్టర్​ ముజామ్మిల్​ ఖాన్​
  • మిర్చి యార్డులో ఆకస్మిక తనిఖీ 
  • కొనుగోళ్ల జాప్యంపై ఆగ్రహం

ఖమ్మం, వెలుగు :  నాణ్యమైన మిర్చికి ధర తగ్గించి, కొనుగోళ్లలో రైతులను మోసం చేస్తే  ట్రేడర్లపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ హెచ్చరించారు. నాణ్యత కలిగిన పంటలకు కూడా ధర రావడం లేదనే ఆరోపణల నేపథ్యంలో మంగళవారం ఖమ్మం మిర్చి మార్కెట్ ను  ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సరుకు బాగానే ఉన్నా తక్కువ ధర చెల్లిస్తున్నందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు భారీగా తగ్గిస్తున్నారని రైతులు కలెక్టర్​ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ వ్యాపార లావాదేవీలను, సరుకు నాణ్యతను మార్కెట్ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. గిట్టుబాటుధరకు మిర్చి కొనుగోలు చేయాలని చెప్పారు. రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. 

ఏఐతో విద్యా బోధన

ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ)ను వినియోగిస్తూ విద్యార్థులకు సులభంగా విద్యా బోధన చేసేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. ఖమ్మం సిటీలోని 53వ డివిజన్ ఎన్​ఎస్పీకాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఏఐ విద్యా బోధనను  ప్రారంభించారు. ఏఐని వినియోగిస్తూ విద్యార్థులను ఆకట్టుకునేలా సులభ రీతిలో బోధించాలని టీచర్లకు సూచించారు. జిల్లాలోని ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ఏఐ విద్యా బోధనను ప్రారంభిస్తున్నామన్నారు. విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్​ చదివి రాసేలా గణిత అంశాల్లో పట్టు సాధించడమే లక్ష్యమన్నారు. 

ప్రభుత్వ ఆస్పత్రులపై విశ్వాసం కల్పించాలి

ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజల్లో విశ్వాసం కల్పించాలని కలెక్టర్ అన్నారు. ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేషెంట్లకు కావాల్సిన వసతి ఏర్పాట్లపై, పార్కింగ్, టాయిలెట్స్ నిర్మాణాల కోసం అధికారులకు పలు సూచనలు చేశారు. మహిళా శక్తి పథకంలో భాగంగా ఆస్పత్రిలో నడుపుతున్న క్యాంటీన్ ను సందర్శించారు. 

అనంతరం పేషెంట్లకు, వారి సహాయకులకు సత్యసాయి సేవా అన్నదానం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ భోజనం వడ్డించారు. భోజనం రుచికరంగా ఉండాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్​ ఎల్. కిరణ్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ బి. కిరణ్, వైద్యాధికారులు పాల్గొన్నారు.