
ఖమ్మం టౌన్, వెలుగు: జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను చరిత్ర ప్రతిబింబించేలా అభివృద్ధి చేయాలని, ఆ దిశగా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ శ్రీజ, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి కలెక్టరేట్లో పురావస్తు, పర్యాటక శాఖ అధికారులతో నేలకొండపల్లి బౌద్ధ స్తూపం, పాలేరు లేక్, ఖమ్మం ఖిల్లా పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై సమీక్షించారు.
కలెక్టర్ మాట్లాడుతూ చారిత్రాత్మక ప్రాంతాల వద్ద సిమెంట్ కట్టడాలను తగ్గించాలని, అక్కడ చేపట్టే ప్రతి అభివృద్ధి పనిలో మన చరిత్ర ప్రతిబింబించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. బౌద్ధ స్తూపం వద్ద ఓపెన్ ఎయిర్ మ్యూజియం ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు తయారు చేయాలని, అక్కడ వాకింగ్ పార్క్ ఏరియా అభివృద్ధి చేయాలని కలెక్టర్ సూచించారు. పాలేరు లేక్ పార్కు వద్ద ఉన్న పాత నిర్మాణాలకు కావాల్సిన మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. సందర్శకుల బోటింగ్ కు చర్యలు చేపట్టాలని, కాటేజీల నిర్మాణానికి ప్లాన్ చేయాలని తెలిపారు.
ఖమ్మం ఖిల్లా వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని పిక్నిక్ స్పాట్ గా అభివృద్ధి చేసేందుకు అక్కడ నాలుగైదు వ్యూ పాయింట్లను అభివృద్ధి చేయాలని కలెక్టర్ తెలిపారు. ఖిల్లా చుట్టూ ఫెన్సింగ్ వేయాలన్నారు. సమావేశంలో ఖమ్మం ఆర్డీవో నరసింహా రావు, ఆర్కిటెక్చర్ వి.సత్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
స్టూడెంట్స్ కు అభినందనలు...
ఎం.పి.హెచ్.డబ్ల్యూ. ఫలితాల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన మహిళా ప్రాంగణ విద్యార్థినులకు, సిబ్బందికి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఎం.పి.హెచ్.డబ్ల్యూ (మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్) రాష్ట్ర, జిల్లా స్థాయి ర్యాంకులను సాధించిన ఖమ్మం మహిళా ప్రాంగణ విద్యార్థినులు మంగళవారం కలెక్టరేట్ లో కలెక్టర్ ను కలిసారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన పరీక్షల్లో ఫస్ట్ ఇయర్ లో 1,6,8,10 స్టేట్ ర్యాంకులు, రెండో సంవత్సరం సంబంధించి రాష్ట్ర స్థాయిలో 2 నుంచి 12 ర్యాంకులను, జిల్లాస్థాయిలో మొదటి పది ర్యాంకులను మొదటి, రెండవ సంవత్సరం ఖమ్మం మహిళా ప్రాంగణం విద్యార్థినులకు వచ్చాయని మహిళా ప్రాంగణం మేనేజర్ వేల్పుల విజేత జిల్లా కలెక్టర్ కు వివరించారు. కలెక్టర్ ను కలిసిన వారిలో మహిళా ప్రాంగణం మేనేజర్ వేల్పుల విజేత, నాగసరస్వతి, స్పందన, హిమబిందు, మల్లిక, విజయ్ కుమార్, సుకన్య, మౌనిక, లాలయ్య, దుర్గా రావు, విద్యార్థినులు తదితరులున్నారు.