రేపటి నుంచి 24 గంటల వైద్య సేవలు
గర్భిణులు, చిన్న పిల్లలపై శ్రద్ధ చూపాలి
నల్గొండ అర్బన్, వెలుగు : ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రుల్లో కార్పొరేట్‌స్థాయి వైద్య సేవలు అందించేందుకు కలెక్టర్ నారాయణరెడ్డి మోడల్ఆస్పత్రులను ఎంపిక చేశారు. దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రుల్లో ఈనెల 15 నుంచి 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, ప్రధానంగా గర్భిణులు, చిన్న పిల్లలపై డాక్టర్లు శ్రద్ధ చూపాలని మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశాలు జారీ చేశారు.
ఈడీడీలో నమోదైన వివరాల ప్రకారం ప్రసవాలు చేయాలని, చిన్న పిల్లల వైద్యంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ఈనెల 16 నుంచి వారం రోజులపాటు అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో జ్వర సర్వే కొనసాగించాలని చెప్పారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించాలని తెలిపారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ చేయాలన్నారు. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా జాతీయ పతాక నిబంధనలు పాటించాలని సూచించారు
.
సాధారణ ప్రసవాలపై దృష్టి సారించాలి
మునుగోడు, వెలుగు : ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలపై వైద్యులు దృష్టి సారించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. నల్గొండ జిల్లా మునుగోడు ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా కలెక్టర్ తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్, ల్యాబ్, టెస్టింగ్ రిపోర్ట్స్ ను పరిశీలించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి వంటగది, పరిసరాలను పరిశీలించారు. సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేశారు.