భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రైతు భరోసా, రైతు బీమా, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధులను పంట రుణాల కింద జమ చేయొద్దని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ బ్యాంకర్లకు సూచించారు. కలెక్టరేట్లో పలు శాఖల ఆఫీసర్లు, బ్యాంకర్లతో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట రుణాలకు సంబంధించి బ్యాంకుల వారీగా కలెక్టర్ సమీక్షించారు. రుణ ప్రణాళిక బుక్‌లను ఆవిష్కరించారు. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు రుణాలను రైతులకు ఇవ్వడంలో చాలా పూర్‌గా ఉన్నాయన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,710 కోట్ల క్రాప్ లోన్లకు గానూ మార్చి చివరి నాటికి రూ. 1,400.24కోట్ల అందించినట్లు తెలిపారు.
తమ రుణాలను రెన్యూవల్ చేసుకునే అంశంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రుణాల ప్రతిపాదనలను బ్యాంకర్లకు అందించి, త్వరగా శాంక్షన్ చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 7,344కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళికను రూపొందించామని చెప్పారు. రూ.3,418.94కోట్లతో క్రాప్ లోన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్వశక్తి సంఘాలకు సంబంధించి రుణాల రికవరిపై దృష్టి పెట్టాలని సూచించారు.
లోన్లు ఇవ్వడంలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కూరగాయల సాగు, నర్సరీలు, కోల్డ్ స్టోరేజ్‌ల ఏర్పాటుతోపాటు వ్యవసాయ పనిముట్లకు అవసరమైన రుణాలను బ్యాంకర్లు మంజూరు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి ఆఫీసర్ విద్యాచందన, లీడ్ బ్యాంక్ మేనేజర్ రాంరెడ్డి, పలు శాఖల జిల్లా అధికారులు సంజీవరావు, సూర్యనారాయణ, రవి బ్యాంక్ అధికారులు పృథ్వీ, సుజిత్ కుమార్, నాబార్డ్ అధికారులు పాల్గొన్నారు.