గద్వాల, వెలుగు: ఐదవ శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో ఉత్సవాలపై ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి 24 వరకు నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఏడాది మాదిరిగానే ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని, మంచి నీటి సౌలత్ కల్పించాలన్నారు. 20న కల్యాణోత్సవం, 24న తెప్పోత్సవ కార్యక్రమాల్లో ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అన్ని శాఖల ఆఫీసర్లు కో ఆర్డినేషన్ తో బ్రహ్మోత్సవాలను సక్సెస్ చేయాలన్నారు. ఆర్డీవో చంద్రకళ, ఏవో భద్రప్ప, ఈవో పురేందర్, డీఎంహెచ్ వో శశికళ, మున్సిపల్ కమిషనర్ దయానంద్, ఫిషరీస్ ఏడీ షకీలా బాను పాల్గొన్నారు.