
చెన్నూర్, వెలుగు: జిల్లాలో పత్తి కొనుగోలు లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. చెన్నూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తహసీల్దార్ మల్లికార్జున్‌తో కలిసి జిన్నింగ్ మిల్లుల యజమానులతో రివ్యూ నిర్వహించారు. జిన్నింగ్ మిల్లుల యజమానులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రక్షణ చర్యలు తీసుకోవాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియ జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
మిల్లుల్లో పత్తి నిల్వలు పేరుకుపోకుండా చూడాలని, మిల్లులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. పత్తి విక్రయించేందుకు వచ్చే రైతులకు తాగునీరు, ఇతర వసతులు కల్పించాలని, కొనుగోలు ప్రక్రియ పూర్తయిన 7 రోజుల్లోగా ఆన్లైన్ ద్వారా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్, సీసీఐ అధికారులు, ఏఈవోలు, జిన్నింగ్ మిల్లుల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి
కోటపల్లి, వెలుగు: విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు. కోటపల్లి మండలం పంగిడి సోమారంలోని ప్రైమరీ స్కూల్‌ను కలెక్టర్ మంగళవారం సందర్శించి తరగతి గదులు, మధ్యాహ్న భోజనం, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యం, వారి హాజరు పట్ల టీచర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు సకాలంలో పౌష్టికాహారం అందించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాన్ని, నర్సరీని పరిశీలించారు. నాటేందుకు అవసరమైన మొక్కలను సిద్ధం చేయాలని, వేసవి నేపథ్యంలో మొక్కలకు సకాలంలో నీరు అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా చేపట్టాలన్నారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రజలను నిరంతరం అందించాలన్నారు. గ్రామంలోని మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు.