
హనుమకొండ, వెలుగు: మహాశివరాత్రి ఉత్సవాలకు అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య సూచించారు. ఈ నెల 26న నిర్వహించనున్న మహా శివరాత్రి ఉత్సవాలపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, ఆర్టీసీ, విద్యుత్, ఆర్అండ్ బీ, అగ్నిమాపక, వైద్య ఆరోగ్యశాఖ, తదితర శాఖల ఆఫీసర్లతో కలెక్టర్ కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. హనుమకొండలోని వేయి స్తంభాల గుడి, మడికొండ మెట్టు రామలింగేశ్వరస్వామి ఆలయాల్లో ఏర్పాట్లపై సమీక్షించారు.
అనంతరం మహాశివరాత్రి ఉత్సవాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అంతకుముందు కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తంగా 70 దరఖాస్తులు రాగా, వాటిని సంబంధిత అధికారులకు పంపించి, వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఐసీడీఎస్ ఆఫీసర్లు, సూపర్ వైజర్లు, పంచాయతీరాజ్ అధికారులతో రివ్యూ చేసి అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్తు, తాగునీరు, టాయిలెట్స్, తదితర అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆఫీసర్లకు సూచించారు.