నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జిల్లాలో అలోపతి వైద్యంతో పాటు ఆయుష్ సేవలను ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఆయుష్, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల డాక్టర్లు, ఫార్మసిస్టులు, సిబ్బందితో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీహెచ్ సీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు వచ్చే వ్యాధిగ్రస్తులకు ఆలోపతి వైద్యంతో పాటు ఆయుర్వేద, యునాని, హోమియోపతి సేవలను అందించాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో ఆయుర్వేదం, పంచకర్మ వైద్యసేవలను ఈ నెల చివరి నాటికి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.
ప్రకృతి వైద్యానికి నాగర్ కర్నూల్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచేలా ఆయుష్ డాక్టర్లు కృషి చేయాలన్నారు. వైద్యారోగ్యశాఖ ఆఫీసులో ఆయుష్ విభాగాన్ని ఏర్పాటు చేసి నోడల్ ఆఫీసర్‌గా సీనియర్ డాక్టర్ గోపాల్ ను నియమించి ఆయుష్ డాక్టర్ల పనితీరును పర్యవేక్షించాలని ఆదేశించారు. మీటింగ్‌కు హాజరు కాని డాక్టర్లకు షోకాష్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు. డీఎంహెచ్ వో సుధాకర్ లాల్ పాల్గొన్నారు.