నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : పోలింగ్ సిబ్బంది రెండో దశ ర్యాండమైజేషన్ కంప్లీట్ చేసినట్లు కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో ఎన్నికల పరిశీలకుడు మిథిలేశ్ మిశ్రా, సతీశ్ కుమార్ తో కలిసి ర్యాండమైజేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేటతో పాటు కల్వకుర్తిలోని 103, జడ్చర్లలోని 22 పోలింగ్ కేంద్రాలతో కలిపి 826 పోలింగ్ బూత్ లు ఉన్నాయని చెప్పారు. 991 మంది పీవోలు, 991 మంది ఏపీవోలు, 1982 మంది ఓపీవోలతో కలిపి 3,964 మంది సిబ్బందిని ఎన్నికల విధులకు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
ఎన్‌ఐసీ రూపొందించిన సాఫ్ట్‌వేర్ ను వినియోగించి ర్యాండమైజేషన్ పూర్తి చేశామని తెలిపారు. అనంతరం నాగర్ కర్నూల్ మండలం మంతటి చౌరస్తా, తాడూర్, మేడిపూర్ వద్ద గల సర్వేలైన్స్, ఎస్‌ఎస్‌టీ చెక్ పోస్ట్ ను కలెక్టర్ పరిశీలించారు. వాహనాల తనిఖీ, జప్తులపై అధికారులకు పలు సూచనలు చేశారు. అంబులెన్స్‌లతో పాటు ప్రతి వెహికల్‌ను చెక్ చేయాలని ఆదేశించారు. తాడూరు మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
మహబూబ్ నగర్ కలెక్టరేట్ : మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్ ను అబ్జర్వర్సంజయ్ కుమార్ మిశ్రా, కలెక్టర్ జి.రవి నాయక్ పరిశీలించారు. పోటీలో ఉన్న అభ్యర్థులు, ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల ర్యాండమైజేషన్ నిర్వహించారు. రిటర్నింగ్ ఆఫీసర్ అనిల్ కుమార్, ఏఆర్వో నాగార్జున పాల్గొన్నారు.
వనపర్తి : ఎన్నికల్లో వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎలక్షన్ కమిషన్ అవకాశం కల్పించిందని వనపర్తి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ చెప్పారు. శనివారం వనపర్తి ఐడీవోసీ ప్రజావాణి హాల్ లో హోమ్ ఓటింగ్ పై పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ నెల 21, 22 తేదీల్లో హోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. అధికారులు, సిబ్బంది హోమ్ ఓటర్ల లిస్టును, ఎలక్షన్ మెటీరియల్‌ను సరి చూసుకోవాలని సూచించారు. రిటర్నింగ్ అధికారి ఎస్.తిరుపతి రావు, నోడల్ ఆఫీసర్లు వెంకటరమణ, సురేశ్ పాల్గొన్నారు.
కొత్త ఈవీఎంల వినియోగం
జడ్చర్ల టౌన్ : ఈ ఎన్నికల్లో కొత్త ఈవీఎంలను వినియోగిస్తున్నట్లు ఎన్నికల పరిశీలకుడు సంజయ్ కుమార్ మిశ్రా తెలిపారు. రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్త ఈవీఎం మెషీన్లను ఏర్పాటు చేస్తున్నామని, టెక్నాలజీ పెరిగినందున ఎలాంటి సమస్య ఉండదన్నారు. ఎక్కడైనా సమస్య వస్తే కొత్త యూనిట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆర్వో ఎస్. మోహన్ రావు, ఏఆర్వో శ్రీనివాసులు పాల్గొన్నారు.