సంక్షేమ పథకాల సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి : పమేలా సత్పతి

  •  కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: ఈ నెల 26 నుంచి అమలుచేయనున్న నాలుగు సంక్షేమ పథకాలకు సంబంధించిన సర్వేను 16 నుంచి 20 వరకు క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పూర్తిచేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లు.. పథకాల అమలుపై అధికారులకు స్పష్టమైన అవగాహన ఉండాలని ఆదేశించారు.

 లబ్ధిదారుల ఎంపిక  నిరంతర ప్రక్రియ అని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించేందుకు ఆర్ఐ, ఏఈవోలు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా తనిఖీ చేయాలన్నారు. 

జాబ్‌‌‌‌ కార్డు ఉండి, 20 రోజులు ఉపాధి పని చేయడంతోపాటు వారికి వ్యవసాయ భూమి లేనివారే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులని, దీనికి సంబంధించిన సర్వేను ఈనెల 18లోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్, మున్సిపల్, రెవెన్యూ ఆఫీసర్లు పాల్గొన్నారు. 

అర్హులకు ప్రభుత్వ పథకాలు చేరేలా కార్యాచరణ

రాజన్న సిరిసిల్ల, వెలుగు: అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు పటిష్ఠ కార్యాచరణను అమలుచేయాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌‌‌‌లో  అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్‌‌‌‌తో కలిసి రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల జారీ.. తదితర అంశాలపై అధికారులతో  రివ్యూ నిర్వహించారు. జనవరి 26 నుంచి కొత్తగా నాలుగు ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు సంబంధించి పాటించాల్సిన విధివిధానాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు.

 కలెక్టర్ మాట్లాడుతూ సాగులో ఉన్న భూములను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి నమోదు చేయాలన్నారు. నాలా కన్వర్షన్లు, రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌, పరిశ్రమలకు కేటాయించిన భూములు, వివిధ అభివృద్ధి పనులకు కేటాయించినవి.. తదితర సాగుకు యోగ్యం కాని భూములను రైతు భరోసా జాబితా నుంచి తొలగించాలని సూచించారు. తహసీల్దార్‌‌‌‌‌‌‌‌, ఏవో, ఆర్‌‌‌‌‌‌‌‌ఐ, సర్వేయర్లు, మైనింగ్ అధికారులు సమన్వయంతో పనిచేసి పట్టా పాస్ బుక్‌‌‌‌ల డేటా, గూగుల్, రెవెన్యూ మ్యాప్‌‌‌‌ల వారీగా పరిశీలించాలని సూచించారు. మీటింగ్‌‌‌‌లో డీఆర్‌‌‌‌‌‌‌‌డీవో శేషాద్రి, డీఏవో అఫ్జల్​బేగం, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు తహసీల్దార్లు, వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులు  పాల్గొన్నారు.