
- పోలింగ్‌కు 48గంటల ముందు ప్రచారం బంద్
కరీంనగర్ టౌన్, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలాసత్పతి అధికారులను ఆదేశించారు. ఈ నెల 27న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఎన్నికలు పూర్తయ్యేదాకా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పోలింగ్‌కు ముందు 48 గంటల పాటు ప్రచారం, సమావేశాలు, ఊరేగింపులు బంద్ చేయాలన్నారు.
బల్క్ ఎస్ఎంఎస్‌లు కూడా పంపొద్దన్నారు. ఈసీ రూల్స్ పాటించాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సైలెన్స్ పీరియడ్‌లో ఇతర జిల్లాలకు చెందిన వ్యక్తులు ఎవరూ జిల్లాలో ఉండొద్దని స్పష్టం చేశారు. అనంతరం హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ బుద్దప్రకాశ్ నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, ట్రైనీ కలెక్టర్ అజయ్‌యాదవ్, ఆర్డీవో మహేశ్వర్ పాల్గొన్నారు.
పోలింగ్ రోజు ఉద్యోగులకు సెలవు
ఈనెల 27న నిర్వహించనున్న ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు వర్తిస్తుందన్నారు. దీంతోపాటు వ్యాపార, వాణిజ్య సంస్థలు, ఇతర ప్రైవేట్ మేనేజ్‌మెంట్లు కూడా గ్రాడ్యుయేట్ ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు, కార్మికులు ఓటు హక్కును వినియోగించుకునేలా వెసులుబాటు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల సందర్భంగా 25న సాయంత్రం 4 గంటల నుంచి 27న సాయంత్రం 4గంటల వరకు వైన్స్, బార్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలు, స్టార్ హోటల్స్ మూసివేయాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ పి.శ్రీనివాస్‌రావు సూచించారు.
ఎన్నికల నిర్వహణలో పొరపాట్లు చేయొద్దు
జగిత్యాల, వెలుగు: ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలను పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ నిర్వహణపై పీవో, ఏపీవోలకు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ఈసీ రూల్స్ పాటించాలన్నారు. పోలింగ్‌కు ఒకరోజు ముందుగానే ప్రిసైడింగ్ అధికారులు తమ బృందంతో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్ రెడ్డి, శ్రీనివాస్, పీవోలు, ఓపీవోలు పాల్గొన్నారు.
పీవో, ఏపీవోలకు ట్రైనింగ్
రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని ట్రైనింగ్ నోడల్ అధికారి, సీపీవో శ్రీనివాసాచారి అన్నారు. కలెక్టరేట్‌లో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లకు పోలింగ్ నిర్వహణపై ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచారి మాట్లాడుతూ రాజన్నసిరిసిల్ల జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసం 28 పోలింగ్ కేంద్రాలు, టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ కోసం 13 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. నిబంధనలు పాటిస్తూ పోలింగ్ సజావుగా జరపాలన్నారు. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, మాస్టర్ ట్రైనర్లు మహేందర్ రెడ్డి, శ్రీధర్ పాల్గొన్నారు.