
- కలెక్టర్ పమేలా సత్పతి
కొత్తపల్లి, వెలుగు : రైతుల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతిని ప్రవేశపెట్టిందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కొత్తపల్లి పట్టణంలోని రైతువేదిక, కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్ రైతువేదికలో భూభారతి, ఆర్వోఆర్ చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆర్వోఆర్ చట్టంతో సాదాబైనామా దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుందని, విచారణ, సర్వే తర్వాతే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు చేస్తామన్నారు.
తహసీల్దార్ వద్ద న్యాయం జరగలేదనుకుంటే ఆర్డీవో వద్దకు, అక్కడ సంతృప్తి చెందకుంటే కలెక్టర్, భూమి ట్రిబ్యునల్ వద్దకు వెళ్లి అప్పీలు చేసుకోవచ్చని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం రైతులకు చుట్టం అని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి అన్నారు. ధరణి కారణంగా చెప్పులు అరిగేలా తిరిగినా రైతుల భూ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ధరణి పోర్టల్లో తనకు కూడా 20 గుంటల భూమి తక్కువ ఉన్నట్లు నమోదు కావడంతో ఇబ్బంది పడినట్లు తెలిపారు. కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ తహశీల్దార్లు రాజేశ్, రాజు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
స్టేట్ లోనే మోడల్ స్పోర్ట్స్ స్కూల్ గా నిలవాలి
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ తెలంగాణలోనే మోడల్ స్పోర్ట్స్ స్కూల్ గా నిలిచేలా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశించారు. శనివారం సిటీలోని రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ ను కలెక్టర్ పమేలాసత్పతి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ....స్పోర్ట్స్ స్కూల్ లో చేపట్టిన అభివృద్ధి పనులు సత్వరమే పూర్తి చేయాలన్నారు. అనంతరం ముకరంపురలోని భవిత సెంటర్ ను కలెక్టర్ సందర్శించి, ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఏర్పాటు చేసిన భవిత సెంటర్ లోని విద్యార్థులను సొంతబిడ్డల్లా చూసుకోవాలని చెప్పారు. అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్, జీసీడీవో కృపారాణి, ప్లానింగ్ కోఆర్డినేటర్ మిల్కురి శ్రీనివాస్, పీఆర్ డీఈ జనార్థన్, తదితరులు పాల్గొన్నారు.