రామడుగు, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు, రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు లబ్ధిదారుల ఎంపిక సర్వేను పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. రామడుగు మండలం వెదిర జీపీ వద్ద, గోపాల్‌రావుపేట గ్రామ శివారులో జరిగిన క్షేత్రస్థాయి సర్వేను అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్‌దేశాయ్‌తో కలిసి సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా వివరాలు నమోదు చేయాలన్నారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించి కుటుంబ ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. రైతుభరోసా కింద కేవలం సాగుభూముల వివరాలనే నమోదు చేయాలన్నారు. బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాశ్, ఏడీఏ ప్రియదర్శిని, తహసీల్దార్ వెంకటలక్ష్మి, ఎంపీడీవో రాజేశ్వరి, ఏవో త్రివేదిక ఉన్నారు.