
- మూడు షిఫ్టుల్లో సిబ్బందికి విధులు
- కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ పమేలా సత్పతి శనివారం సందర్శించారు. కౌంటింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్స్ లను, సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 3 నుంచి జరగబోయే కౌంటింగ్ కోసం మైక్రో అబ్జర్వర్లు, సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.
గ్రాడ్యుయేట్ ఓట్ల కోసం మొత్తం 21 టేబుళ్లు, టీచర్స్ కోసం 14 టేబుళ్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి టేబుల్ వద్ద మైక్రో అబ్జర్వర్, సూపర్ వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు విధులు నిర్వర్తిస్తారని వెల్లడించారు. కౌంటింగ్ ప్రక్రియకు సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉన్నందున కౌంటింగ్ సిబ్బంది మూడు షిప్టుల్లో విధులు నిర్వహిస్తారని వెల్లడించారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ మహేశ్వర్ ఉన్నారు.