కరీంనగర్ టౌన్, వెలుగు : ఆడపిల్లలను ప్రోత్సహించాలని, బాలికను సమాజంలో ఎదగనివ్వాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బేటీ బచావో, బేటీ పడావో ప్రోగ్రామ్‌ను ప్రారంభించి 10ఏళ్లైన సందర్భంగా మహిళాభివృద్ది,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఆర్టీసీ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన సంతకాల సేకరణలో కలెక్టర్ పాల్గొన్నారు. పోస్టర్ ఆవిష్కరించి ఆడపిల్లల్ని రక్షించాలని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలికల అణచివేతకు వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం బేటీ బచావో– బేటీ పడావో కార్యక్రమాన్ని తీసుకొచ్చిందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, డీడబ్ల్యూవో కె.సబిత, ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం భూపతిరెడ్డి, డీఎంలు విజయ మాధురి, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
విజేతలకు బహుమతులు
వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడాపోటీల విజేతలకు బుధవారం జిల్లా జనరల్ హాస్పిటల్ లో కలెక్టర్ పమేలాసత్పతి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొవిడ్ తర్వాత మొదటిసారి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించినట్లు చెప్పారు.
సూపరింటెండెంట్ డా.వీరారెడ్డి మాట్లాడుతూ శారీరక, మానసిక ఉల్లాసానికి రంగోళి, క్యారం, చెస్, టెన్నికాయిట్, క్రికెట్, షటిల్ గేమ్స్ నిర్వహించినట్లు వెల్లడించారు. ఆర్ఎంవో నవీనా, డిప్యూటీ సివిల్ సర్జన్ రవి ప్రకాశ్‌రెడ్డి, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ హరికృష్ణారెడ్డి పాల్గొన్నారు.