కరీంనగర్ టౌన్,వెలుగు: నేతన్న యాప్ పై చేనేత కార్మికులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ లో చేనేత, మరమగ్గాల కార్మికులతో పాటు అనుబంధ కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. చేనేత, పవర్ లూమ్ కార్మికుల కోసం ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాల రాయితీ కోసం ఈ యాప్ ను ఉపయోగించుకోవాలని చెప్పారు.
ఈ యాప్ గురించి పూర్తి సమాచారంతోపాటు అవగాహనను లబ్ధిదారులకు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. చేనేత కార్మికుల ద్వారా తయారు చేయబడిన టవల్స్, కర్టెన్స్ ను జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించాలని ఆదేశించారు. అంతేకాకుండా మార్కెటింగ్ కోసం కృషి చేస్తానని తెలిపారు. చేనేత ముద్ర లోన్ల ద్వారా గరిష్టంగా రూ.5 లక్షల రుణం ఇస్తున్నట్లు తెలిపారు. ఏదైనా బ్యాంకులో మార్టిగేజ్,సెక్యూరిటీ అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో రీజనల్ డీడీ వి. అశోక్ రావు, ఎస్ఎస్ చరణ్, డీఎంఓటీ వెంకటేశ్వర్లు, సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు.