కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల సమన్వయంతో విద్యార్థులకు పలు పోటీ పరీక్షలకు కోచింగ్ ఇవ్వనున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఈ మేరకు ప్రయివేట్ స్కూళ్ల మేనేజ్‌మెంట్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్ల యాజమానులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
అనంతరం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని స్థానిక ఓల్డ్ హైస్కూల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్‌దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, డీఎంహెచ్‌వో కె.వెంకట్ రమణ, ఐఎంఏ ప్రెసిడెంట్ డా.నరేశ్, అల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి, సెయింట్ జార్జ్ చైర్మన్ ఫాతిమారెడ్డి, సాధన చైర్మన్ శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.
మైత్రి ట్రాన్స్ క్లినిక్స్‌ను వినియోగించుకోవాలి
కొత్తపల్లి, వెలుగు: మైత్రి ట్రాన్స్ క్లినిక్‌ను ట్రాన్స్ జెండర్లు వినియోగించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ప్రజా పాలన, ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మైత్రి ట్రాన్స్ క్లినిక్, ప్రభుత్వ పారామెడికల్ నర్సింగ్ కాలేజీలను సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.
జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాలలో ఎంసీహెచ్‌లో మైత్రి ట్రాన్స్ క్లినిక్‌ను అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరేశ్, ఎంసీహెచ్ సూపరింటెండెంట్ రాములు మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్‌లు సమాజంలో అభివృద్ధి ఫలాలు పొందాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ట్రాన్స్ జెండర్లకు ఏదైనా సమస్య ఉంటే హెల్ప్ లైన్ 155326లో సంప్రదించాలని సూచించారు.