కరీంనగర్ టౌన్, వెలుగు: విద్యార్థులకు సులభమైన పద్ధతుల్లో పాఠాలు బోధిస్తూ వారిని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత టీచర్లపై ఉందని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్ల సైన్స్ టీచర్లకు జిల్లా విద్యాశాఖ, రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ బెంగళూరు ఆధ్వర్యంలో 4 రోజుల వర్క్‌షాప్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి రెండ్రోజులు ఫిజిక్స్ టీచర్లు, చివరి రెండ్రోజులు బయాలజీ టీచర్లు పాల్గొననున్నట్లు వెల్లడించారు. వర్క్ షాప్ లో సరళమైన బోధనా పద్ధతులు, సైన్స్ అంశాలపై అవగాహన కల్పించనున్నారని తెలిపారు. చదువులో వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి తదనుగుణంగా ముందుకెళ్లాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, డీఈవో జనార్ధన్‌రావు, క్వాలిటీ కో ఆర్డినేటర్ అశోక్ రెడ్డి, స్వదేశీ కుమార్, సైన్స్ ఆఫీసర్ జయపాల్ రెడ్డి పాల్గొన్నారు.
చిరువ్యాపారులను షెడ్లల్లోకి తరలించాలి
కరీంనగర్ బల్దియా ఆధ్వర్యంలో చైతన్యపురిలో నిర్మించిన మార్కెట్ షెడ్లల్లో కూరగాయలు అమ్మకాలు జరిగేలా చూడాలని కలెక్టర్ పమేలాసత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం చైతన్యపురిలో ఖాళీగా ఉన్న మార్కెట్ షెడ్ ను మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్లపై చిరువ్యాపారులు అమ్ముతుండడంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, వారిని షెడ్లలోకి తరలించాలన్నారు.