జమ్మికుంట, వెలుగు: మహిళలు బాగుంటేనే దేశం బాగుంటుందని, పోషకాహారంతోనే ఆరోగ్య సమాజం నిర్మితమవుతుందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఐసీడీఎస్ఆధ్వర్యంలో మంగళవారం జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో పోషణ్ పక్షోత్సవాల్లో భాగంగా పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అందరం కలిసి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. మహిళలు, గర్భిణులు రక్తహీనత నివారణకు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలువురు చిన్నారులకు అన్నప్రాశన, గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు.
అనంతరం కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాల్లో ఏర్పాటు చేసిన ప్రదర్శన క్షేత్రాలను కలెక్టర్ పరిశీలించారు. కృషి విజ్ఞాన కేంద్రంలో చేపడుతున్న కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట అడిషనల్కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, సంక్షేమ అధికారి సరస్వతి, ఆర్డీవో రమేశ్‌బాబు, మున్సిపల్ కమిషనర్ ఆయాజ్, శాస్త్రవేత్తలు ఎన్.వెంకటేశ్వరరావు, ప్రశాంతి, సీడీపీవో తిరుమల పాల్గొన్నారు.
ప్రజాసేవలకు ఇబ్బందులుండొద్దు
కరీంనగర్ టౌన్,వెలుగు: పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో నిబంధనల ప్రకారం ప్రజా సేవలకు ఇబ్బందులు కలగకుండా పని చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, సీపీవో కొమురయ్య, ఇరిగేషన్ ఎస్ఈ శివకుమార్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ గంగాధర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.