కరీంనగర్ జిల్లాలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్ పమేలా సత్పతి

  •     కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు : జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిచేశామని, ప్రతీఒక్కరు  తప్పకుండా వారి ఓటుహక్కును వినియోగించుకోవాలని  కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి  కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రలోభాలకు గురికాకుండా నిజాయతీగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పోలింగ్ టైమ్ లో రాజకీయ పార్టీలు ప్రచారం చేయకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. 12రకాల ఒరిజినల్​ ఫొటోతో కూడిన  గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదానిని చూపించి ఓటేయొచ్చన్నారు.  జిల్లాలో కొత్తగా 25 వేల మంది కొత్తగా ఓటర్లుగా నమోదయ్యారన్నారు. 1195 మంది దివ్యాంగులు, వయోవృద్ధుల ఇండ్లకు వెళ్లి హోమ్​ఓటింగ్ నిర్వహించామని వివరించారు.  

పోస్టల్ బ్యాలెట్ బుధవారం వరకు అవకాశం కల్పించామని గుర్తు చేశారు. జిల్లాలో 5,700 మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నట్లు కలెక్టర్ ​చెప్పారు. వాయిస్ రికార్డెడ్ ఫోన్ కాల్స్, వెహికల్స్ ప్రచారాలు, ఒపినీయన్ ​పోల్స్‌ నిషేధమన్నారు.  కార్యక్రమంలో ఆర్వోలు కె.మహేశ్వర్, ఇన్‌చార్జి సీఈవో పవన్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్  పి. సదానందం, తహసీల్దార్లు  నవీన్,  రమేశ్‌, తదితరులు  పాల్గొన్నారు. 

జగిత్యాల టౌన్, వెలుగు : జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ​యాస్మిన్ బాషా తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 785 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 992 సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. హోమ్ ఓటింగ్ ద్వారా 1141మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు.