- కలెక్టర్ పమేలాసత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రభుత్వ కాలేజీల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని, స్టూడెంట్లు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. మంగళవారం ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజిలో ఫెరియోఫెస్టా పేరుతో విద్యార్థులు ఏర్పాటు చేసిన సోషల్ సైన్స్ ఫెయిర్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిటీలోని ఉమెన్స్ కాలేజీలో 2,700 మంది స్టూడెంట్లు విద్య అభ్యసిస్తున్నారన్నారు. అందరూ ఇష్టంగా చదివి, విజయం సాధించి వివిధ రంగాల్లో స్థిరపడి తోటి మహిళలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వ రంగంలో అన్ని రకాల సౌకర్యాలతో కూడిన విద్య అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగం తరఫున కాలేజీకి సహకారం అందిస్తామన్నారు. అనంతరం ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. పోషక ఆహార ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం స్థానిక సప్తగిరికాలనీ కేజీబీవీలోని దిశ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్‌ను కలెక్టర్ సందర్శించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, గర్ల్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ కృపారాణి, ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి, డాక్టర్ లెఫ్టినెంట్ ఆయేషా షేక్, లెక్చరర్లు,పాల్గొన్నారు.