అధికారులు అందుబాటులో ఉండాలె : కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

అధికారులు అందుబాటులో ఉండాలె : కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

సిద్దిపేట రూరల్, వెలుగు: అగ్రికల్చర్​అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అసోసియేషన్ డైరీని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ..  రైతులకు పంట దిగుబడులు పెంచేందుకు తగు సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు.

కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి, తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ చైర్మన్ శివప్రసాద్, వ్యవసాయ సహాయ సంచాలకుడు అనిల్, రాధిక, తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, కోశాధికారి పరుశురాం రెడ్డి, వ్యవసాయ అధికారులు నరేశ్, శివరామకృష్ణ, ప్రకాశ్ గౌడ్, వసంతరావు, ఆఫ్రోజ్ పాల్గొన్నారు.

అగ్ని వీర్ వాయు కోసం ముందుకు రావాలి

ఎయిర్ ఫోర్సులో అగ్ని వీర్ వాయు ఎంపిక కోసం జిల్లా యువత ముందుకు రావాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ జేడబ్లూవో ఆనంద్ గోస్వామి, ఎస్జీటీ రాజేశ్​లతో కలసి మాట్లాడారు. ఇంటర్మీడియట్ లేదా దానికి సమాన విద్యార్హత గల స్టూడెంట్స్​ మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులలో 50 శాతం మార్కులు కలిగి ఉండి, 2 జనవరి, 2004 నుంచి 2 జులై, 2007 మధ్య పుట్టిన యువతీ యువకులు అగ్ని వీర్​వాయు కోసం ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని సూచించారు.

రిజిస్ట్రేషన్​ ప్రక్రియ జనవరి 17 నుంచి ఫిబ్రవరి 6 వరకు చేసుకోవచ్చన్నారు. ఆన్​లైన్​పరీక్ష మార్చి 17 న ఉంటుందన్నారు. సమావేశంలో ప్రిన్సిపాల్ సీహెచ్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, సూర్యప్రకాశ్, జిల్లా యువజన క్రీడల అధికారి నాగేందర్ పాల్గొన్నారు.