
సిద్దిపేట రూరల్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని పొన్నాల శివారులో గల ఇందూరు కాలేజ్ లో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గాలకు సంబంధించి రిసెప్షన్, స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపునకు గదులను సిద్ధం చేయాలని ఏజెన్సీకి తెలిపారు.
ప్రతి బ్లాక్ ముందు కౌంటర్ల ఏర్పాటు, కౌంటర్ల నుంచి కేంద్రాలకు వెళ్లే మార్గాల్లో గ్రీన్ కార్పెట్ వేయాలని సూచించారు. పోలింగ్ బూత్‌లలో వికలాంగుల కోసం తీసుకువచ్చిన వీల్చైర్లను పంపిణీ చేయాలని ఆర్ఓలకు సూచించారు. అనంతరం ఇందూరు కాలేజ్ వరకు తాత్కాలికగా రోడ్డును వేయాలని పంచాయతీరాజ్ డీఈకి తెలిపారు. సిబ్బంది, పోలీసు అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తప్పనిసరిగా ప్రతి వాహనాన్ని చెక్ చేశాకే లోపలికి పంపించాలని, రిజిస్టర్లు మెయింటెన్ చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట సిద్దిపేట ఆర్వో రమేశ్ బాబు, ఏసీపీ సురేందర్ రెడ్డి, త్రీటౌన్ సీఐ భాను ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, మహేశ్, మున్సిపల్ అధికారులు ఉన్నారు.