ఎల్కతుర్తి, వెలుగు: ఎల్కతుర్తి జంక్షన్ సుందరీకరణ పనులు మార్చికల్లా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ఎల్కతుర్తిలోని జంక్షన్ సుందరీకరణ పనులను కుడా వైస్ చైర్మన్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. అధికారులతో మాట్లాడుతూ పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. ఆర్టీసీ బస్టాండ్ లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ త్వరగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
సూరారం గ్రామంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి భాగ్యలక్ష్మి, సరస్వతి మహిళా స్వయం సహాయక సంఘాలకు కేటాయించిన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. స్థలం, గ్రూపుల ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్య సేవలు ఎలా ఉన్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను తనిఖీ చేశారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ క్యాన్సర్ పై గ్రామాలలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమాల్లో డీఆర్డీవో శ్రీను, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.