పీవీ స్మృతి వనం అందుబాటులోకి తేవాలి : కలెక్టర్​ ప్రావీణ్య

పీవీ స్మృతి వనం అందుబాటులోకి తేవాలి : కలెక్టర్​ ప్రావీణ్య

భీమదేవరపల్లి, వెలుగు: మార్చి 31లోగా పనులు పూర్తి చేసి పీవీ స్మృతివనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని హనుమకొండ కలెక్టర్​ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం స్మృతి వనంలో జరుగుతున్న పనులను ఆమె పరిశీలించారు. క్యాంటీన్​ ఇతర సౌకర్యాలు వాటి నిర్వహణ స్థానిక స్వశక్తి మహిళా సంఘం సభ్యులకు ఇచ్చే విధంగా, డిగ్రీ చదివిన వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి గైడ్​లా ఉపాధి ఇవ్వాలని సూచించారు. 

అంతకుముందు భీమదేవరపల్లి మండలం వంగర శివారు ఫుడ్ ప్రాసెసింగ్ సమీపంలో నవోదయ పాఠశాల ఏర్పాటుకు చేసేందుకు కావాల్సిన 30 ఎకరాల మేర ప్రభుత్వ స్థలాన్ని కలెక్టర్​ పరిశీలించారు. మండల పరిధిలోని రత్నగిరిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆమె పరిశీలించి, ఈ ఏడాదికి 22 లక్షల పని దినాలను కల్పించాల్సిఉండగా, ఇప్పటివరకు 19 లక్షల పని దినాలు మాత్రమే కల్పించినట్లు ఆమె తెలిపారు. వంగర శివారులోని సోలార్ ప్లాంటు ఏర్పాటు కోసం త్వరలో అధికారులతో స్టడీ టూర్ ఏర్పాటు పై ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.