- అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఈ నెల 11న సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు జిల్లాలో పర్యటించనున్నారని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. శుక్రవారం ఎస్పీ బి. రోహిత్ రాజు, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ప్రతీక్ జైన్, జిల్లా ఆఫీసర్లతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. సోమవారం ఉదయం భద్రాచలంలోని సీతారామ చంద్రస్వామిని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకుంటారని తెలిపారు.
మిథిలాస్టేడియంలో జిల్లా అధికారులతో సీఎం, మంత్రులు రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారని చెప్పారు. భద్రాచలం టెంపుల్ డెవలప్మెంట్, ఆలయ భూములకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్‌పై జరిగిన, పెండింగ్ ఉన్న పనులపై పూర్తి స్థాయిలో నివేదికలనుసిద్ధం చేయాలని ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అవసరమైన పనులపై నివేదికలు రూపొందించాలన్నారు.
మీటింగ్ తర్వాత ఇందిరమ్మ ఇండ్ల స్కీంను సీఎం ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం మణుగూరులో జరిగే బహిరంగ సభలో సీఎంతో పాటు మంత్రులు పాల్గొంటారని తెలిపారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభోత్సవం సందర్భంగా దాదాపు మూడు వేల మంది ప్రజలు రానున్నారని తెలిపారు. వీరికి అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. తాగునీరు, సిట్టింగ్ అరెంజ్మెంట్స్, భోజనం లాంటి ఏర్పాట్లను పరిశీలించాలని ఆర్డీఓను ఆదేశించారు. హెలీప్యాడ్‌తో పాటు భద్రత ఏర్పాట్లపై ఎస్పీతో చర్చించారు.
హెలీప్యాడ్ వద్ద అంబులెన్స్, డాక్టర్లు, ఫైరింజన్ అందుబాటులో ఉంచాలన్నారు. భద్రాచలంలోని కల్యాణ మండపం వద్ద కరెంట్ సప్లైలో లోపం లేకుండా చర్యలు తీసుకోవాలని, జనరేటర్, ఏసీల ఏర్పాటు, పార్కింగ్, వసతి ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఐటీడీఏ పీఓ కు సూచించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో డీఆర్ఓ రవీంద్రనాథ్, డీఆర్డీఓ విద్యాచందన, కలెక్టరేట్ ఏఓ గన్యా, డీఎంహెచ్ఓ డాక్టర్ శిరీష, ఆర్డీఓలు దామోదర్‌రావు, మధు, ఆర్అండ్బీ ఈఈ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ఈఈ శ్రీనివాసరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య, ఇరిగేషన్ ఈఈ అర్జున్ పాల్గొన్నారు.