యూనిఫామ్స్​​ కుట్టడంలో డిలే  చేస్తే చర్యలు : ప్రియాంక అల

యూనిఫామ్స్​​ కుట్టడంలో డిలే  చేస్తే చర్యలు : ప్రియాంక అల

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  స్కూళ్లు​ ప్రారంభం నాటికి స్టూడెంట్స్​కు యూనిఫామ్స్​ ఇచ్చేలా  చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులను భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ ప్రియాంక అల ఆదేశించారు. యూనిఫామ్స్​ కుట్టడంలో అలసత్యం వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కొత్తగూడెంలోని మహిళా శక్తి కుట్టు కేంద్రాన్ని ఆమె గురువారం సందర్శించారు. అనంతరం ఎంపీడీవో, ఎంఈవో, ఎంపీవోలతో టెలీకాన్ఫరెన్స్​ నిర్వహించారు. యూనిఫామ్స్​​ కుట్టడంలో జాప్యం జరుగుతుండడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.

పది రోజుల్లో దుస్తుల తయారీ పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని గవర్నమెంట్​ స్కూల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, రెసిడెన్షియల్​ పాఠశాలల్లో చదువుతున్న స్టూడెంట్స్​కు యూనిఫామ్​ ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 63,399 మంది స్టూడెంట్స్​కు గానూ 1,26,677 మీటర్ల క్లాత్​అవసరం ఉండగా ఇప్పటి వరకు 1,16,167 మీటర్ల క్లాత్​ జిల్లాకు చేరుకుందన్నారు.

ఇంకా 10,510 మీటర్ల క్లాత్​ రావాల్సి ఉందని చెప్పారు. యూనిఫామ్స్​​ కుట్టేందుకు జిల్లాలో 93 మహిళా శక్తి కుట్టు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. రోజూ ఎన్ని దుస్తులు కుట్టామో రోజువారీగా నివేదికలు అందజేయాలని సూచించారు. ఈ ప్రోగ్రాంలో డీఆర్​డీవో విద్యాచందన, డీఈవో వెంకటేశ్వరాచారి పాల్గొన్నారు. 

డీఎంఎఫ్​టీ వర్క్స్​పై నివేదిక ఇవ్వాలి

డిస్ట్రిక్ట్​ మినరల్​ ఫౌండేషన్​ ట్రస్ట్​(డీఎంఎఫ్​టీ) ద్వారా జిల్లాలో చేపడుతున్న పనుల పురోగతిపై రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆఫీసర్లను కలెక్టర్​ ప్రియాంక అల ఆదేశించారు. పలు శాఖల ఆఫీసర్లతో కలెక్టరేట్​లో గురువారం నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో ఆమె మాట్లాడారు. పనులు ఏ స్థాయి ఉన్నాయనే వివరాలతో పాటు పూర్తి అయిన వాటి వివరాలు కూడా నివేదికలో పొందుపర్చాలన్నారు. పూర్తి అయిన పనులకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్​ నివేదికలు ఇవ్వాలని సూచించారు. పనుల్లో క్వాలిటీ లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీఆర్​డీవో విద్యాచందన, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

ధాన్యం కొనుగోళ్ల పరిశీలన 

సుజాతనగర్ : మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం కలెక్టర్ ప్రియాంక అల పరిశీలించారు. రైతులతో మాట్లాడి ధాన్యంలో తేమ శాతాన్ని తనిఖీ చేశారు. అనంతరం పాత పోలీసు స్టేషన్ భవనాన్ని పరిశీలించారు. దానిలో హెడ్ కానిస్టేబుల్ కుటుంబం ఉండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భవనాల్లో కుటుంబ సభ్యులతో ఉండకూడదని హెచ్చరించారు.

వెంటనే భవనాన్ని ఖాళీ చేసి ప్రైమరీ హెల్త్ సబ్ సెంటర్ కు అప్పగించాలని ఆదేశించారు. ఆ తర్వాత వేపలగడ్డ గ్రామంలోని ప్రైమరీ స్కూల్ ను సందర్శించారు. స్కూల్ లోని క్లాస్ రూమ్​ స్టోర్ రూమ్​లా ఉందని హెడ్మాస్టర్​పై అసహనం వ్యక్తం చేశారు. స్కూల్ మొదలయ్యే లోపు పరిసరాలు శుభ్రం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వేణు గోపాల్, డీఆర్డీవో విద్య చందన, తహసీల్దార్ శిరీష, పంచాయతీ డీఈ సత్యనారాయణ, ఏఈ శివలాల్, ఏవో నర్మదా, ఎంపీడీవో వెంకట లక్ష్మి, ఎస్సై జూబేదా బేగం పాల్గొన్నారు.