
పాల్వంచ రూరల్, వెలుగు : పాల్వంచ మండలం తోగ్గూడెం మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్‌ను కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల ఆదివారం సందర్శించారు. గ్రిడ్ నుంచి నీటి సరఫరా, రోజువారీ నీటి డిమాండ్ తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీటి శుద్ధి ప్రక్రియలోని దశలను పరిశీలించారు. వేసవిలోనూ ప్రతి ఇంటికీ నల్లానీరు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
మిషన్ భగీరథ ఏఈలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. మిషన్ భగీరథ నుంచి నీటి సరఫరా లేని ప్రాంతాలకు బావులు, బోర్లు ద్వారా నీళ్లు అందించే చర్యలు చేపట్టాలని సూచించారు. వాటర్ ట్యాంక్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి చుట్టూ క్లోరినేషన్ చేయాలని చెప్పారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఈ తిరుమలేశ్, పాల్వంచ మున్సిపల్ ఇంజినీర్లు, పాల్వంచ ఎమ్మార్వో, ఎంపీడీవో పాల్గొన్నారు.