భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఎండల తీవ్రత నేపథ్యంలో డాక్టర్లు హాస్పిటళ్లలో 24 గంటలు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ప్రియాంక అల ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ మీటింగ్లో ఆమె మాట్లాడారు. అత్యవసరమైతే తప్ప డాక్టర్లకు సెలవులు ఇవ్వొద్దన్నారు. వడదెబ్బకు సంబంధించిన మరణాల నమోదు, విచారణకు మండల మెడికల్ ఆఫీసర్, తహసీల్దార్, ఎస్సైలతో కమిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కమిటీ రోజూ నివేదికలను అందజేస్తుందని తెలిపారు.
ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ఉపాధి హామీ కూలీల పనివేళలు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఫ్రూట్ జ్యూస్ కేంద్రాల వద్ద ఉపయోగించే ఐస్ నాణ్యతను పరిశీలించాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఈ ప్రోగ్రాంలో డీఆర్డీఓ విద్యాచందన, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ కృష్ణ గౌడ్, డీఎంహెచ్వో డాక్టర్ శిరీష, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ లక్ష్మణరావు, పంచయతీ ఆఫీసర్ చంద్రమౌళి, డీఏవో వెంకటేశ్వరరావుతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
శిక్షణ తరగతుల పరిశీలన..
పాల్వంచ రూరల్ : పాల్వంచ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భధ్రాచలం నియోజకవర్గ ఎన్నికల సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను కలెక్టర్ ప్రింయాంక అల మంగళవారం పరిశీలించారు. శిక్షణ తరగతులలో ఈవీఎం పరికరాల పనితీరును పీవో, ఏపీవోలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలింగ్ సమయంలో ఇబ్బందులకు గురికాకుండా అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. శిక్షణా తరగతులకు మొత్తం1,233 మందికి గాను 48 మంది గైర్హాజరయ్యారని, హాజరుకానివారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.