ఎన్నికలు సజావుగా నిర్వహించాలి : కలెక్టర్​ ప్రియాంక అల

  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ ప్రియాంక అల

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో లోక్​ సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టామని కలెక్టర్​ ప్రియాంక అల తెలిపారు. కలెక్టరేట్​లో మంగళవారం పోలింగ్​ సిబ్బంది మొదటి దశ ర్యాండమైజేషన్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ ఎన్​ఐసీ రూపొందించిన సాఫ్ట్​ వేర్​ను ఉపయోగిస్తూ ఆన్​లైన్​లో పోలింగ్​ సిబ్బంది మొదటి దశ ర్యాండమైజేషన్​ను నిర్వహించామన్నారు. కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక నియోజకవర్గాల పరిధిలో 962 పోలింగ్​ కేంద్రాలున్నాయని తెలిపారు.

తొమ్మిది ఆక్సిలరీ పోలింగ్​ స్టేషన్ల ఏర్పాటు కోసం రాష్ట్ర ఎన్నికల అధికారికి ప్రపోజల్స్​ పంపించామన్నారు. ఎన్నికల కమిషన్​ మార్గదర్శకాల ప్రకారం అదనంగా సిబ్బంది కేటాయింపు ప్రక్రియ చేపట్టామని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్​ కలెక్టర్​ డీ.వేణుగోపాల్, ఎలక్షన్స్​ సూపరింటెండెంట్ ​ధారా ప్రసాద్, ఎన్​ఐసీ డీఐవో సుశీల్​కుమార్, డీఎల్​ఎంటీ సాయి కృష్ణ పాల్గొన్నారు.

1,11,369మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 1,11,369మెట్రిక్​  టన్నుల ధాన్యాన్ని సేకరించడం లక్ష్యంగా పెట్టుకున్నామని కలెక్టర్​ ప్రియాంక అల తెలిపారు. మంగళవారం కలెక్టరేట్​లో పలు శాఖల అధికారులతో నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో ఆమె మాట్లాడారు. జిల్లాలో 127 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అవసరమైతే అదనపు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

సీఎంఆర్ ​రైస్​ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసి ధాన్యం కొనుగోళ్లలో తేడా లేకుండా చూడాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఇన్​చార్జీని నియమించాలని చెప్పారు. కేంద్రాల్లో గన్నీ సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాలో తాగు నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని ఆఫీసర్లను ఆదేశించారు. గతంలో మంజూరైన పనుల పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు.