భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని 858 అమ్మ ఆదర్శ పాఠశాలల్లో రూ. 26కోట్లతో రిపేర్లు, మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు. స్కూల్స్ రీ ఓపెన్, బడిబాటలో భాగంగా జిల్లాలోని పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, కొత్తగూడెం పట్టణాల్లోని పలు స్కూళ్లలోబుధవారం జరిగిన కార్యక్రమాలకు ఆమె హాజరయ్యారు. జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌తో కలిసి స్టూడెంట్స్‌కు యూనిఫామ్స్, బుక్స్ అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలల పేర దశల వారీగా అన్ని స్కూళ్లను కార్పొరేట్ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేస్తోందని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఎన్నికల సంఘం ఇచ్చిన ప్రత్యేక వెసులుబాటుతో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా పనులు చేపట్టినట్లు వివరించారు. బడిఈడు పిల్లలందరూ బడుల్లో ఉండే విధంగా పిల్లల తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్ పర్సన్ కె. సీతాలక్ష్మి, డీఆర్డీవో విద్యాచందన, ఆర్డీవో మధు, డీఈవో వెంకటేశ్వరాచారి, పలు శాఖల అధికారులు ఉన్నారు.
పాల్వంచ మున్సిపల్ డీఈ పై ఆగ్రహం
పాల్వంచ : ప్రజలకు తాగు నీరు అందించే విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ప్రియాంక అల హెచ్చరించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణంలోని ప్రశాంతి నగర్ వచ్చిన కలెక్టర్ కు స్థానిక ప్రజలు తమకు ఆరు నెలలుగా తాగునీరు అందడం లేదని ఫిర్యాదు చేశారు. దీనిపై మున్సిపల్ డీఈ మురళీ కృష్ణను కలెక్టర్ వివరణ కోరారు. తాము తాగు నీరు ఇస్తున్నామని డీఈ సమాధానం చెప్పారు. దీంతో వెంటనే ఆమె ఫిర్యాదుదారుడి నివాసానికి వెళ్లి పరిశీలించారు. తాగునీరు రావడంలేదని నిర్ధారించి డీఈకి షోకాజు నోటీసు జారీ చేయాలని అడిషనల్ కలెక్టర్ విద్యా చందనను ఆదేశించారు. తాగునీటి సరఫరాపై తనకు నివేదిక సమర్పించాలని మున్సిపల్ కమిషనర్ అజ్మీర స్వామిని ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ వివేక్ ఉన్నారు.