ఉద్యోగుల సెలవులు రద్దు : ప్రియాంక అల

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మిగ్ జాం​ తుఫాన్​ దృష్ట్యా ఉద్యోగులకు సంబంధించి అన్ని రకాల సెలవులను రద్దు చేసినట్టు కలెక్టర్​ ప్రియాంక అల తెలిపారు. సెలవుల్లో వెళ్లిన సిబ్బంది తక్షణమే విధులకు హాజరుకావాలని ఆదేశించారు. మంగళవారం అన్ని శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్​లో ఆమె మాట్లాడారు.

తుఫాన్​ ప్రభావం వల్ల రెండు రోజులు జిల్లాకు భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్​గా ఉండాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్​ చేయాలన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీలలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

తుఫాన్​ దృష్ట్యా జిల్లాలోని గవర్నమెంట్, ప్రైవేట్​ స్కూళ్ల, అంగన్​వాడీ స్కూళ్లకు బుధవారం కూడా సెలవులు ఇస్తున్నట్టు తెలిపారు. ఎమర్జెన్సీ సేవలకు 08744241950 నంబర్​కు ఫోన్​ చేయాలని చెప్పారు. గ్రామాలు, పట్టణాల్లో మురుగునీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. బ్లీచింగ్​ చల్లాలని ఆదేశించారు. ముంపు తగ్గే వరకు వరి కోతలు చేయవద్దని రైతులకు సూచించారు.

ధాన్యం తడవకుండా టార్పాలిన్లు సప్లై చేయాలని అధికారులకు చెప్పారు. కొనుగోలు చేసిన వడ్లను సమీప గోడౌన్లలో భద్రపర్చాలన్నారు.  ఈ ప్రోగ్రాంలో అడిషనల్​ కలెక్టర్లు పి. రాంబాబు, మధుసూదనరాజు, డీపీఓ రమాకాంత్​, జడ్పీ సీఈఓ విద్యాలత, డీఈఓ వెంకటేశ్వరాచారి, డీఎంహెచ్​ఓ డాక్టర్​ శిరీష, మహిళా, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి విజేత, తదితరులు పాల్గొన్నారు.