తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు : కలెక్టర్ ​ప్రియాంక

  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక ఆదేశం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ప్రియాంక చెప్పారు. కొనుగోలు కేంద్రాల ఇన్​చార్జులు, రైస్​మిల్లర్లు, వివిధ డిపార్ట్​మెంట్ల అధికారులతో శుక్రవారం కలెక్టరేట్​లో సమావేశమయ్యారు. వడ్ల కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెడితే చర్యలుంటాయని కలెక్టర్​ప్రియాంక హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లు వచ్చే అవకాశం ఉందని, 159 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. క్రాప్​బుకింగ్​చేసిన ప్రకారం రైతులకు టోకెన్లు జారీ చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వడ్లు రాకుండా చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

కాంటాలు పెట్టిన వెంటనే ఏ రోజుకారోజు వడ్లను మిల్లులకు తరలించాలని చెప్పారు. గన్నీ సంచులు రెడీ చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు పంటను తీసుకొచ్చే రైతులు ఆధార్, బ్యాంక్, పట్టాదార్ పాస్​ పుస్తకం జిరాక్స్​లు తెచ్చుకోవాలని సూచించారు. తూకపు బాట్లు తనిఖీ చేసి సీల్​వేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రాంబాబు, డీఆర్డీఓ మధుసూదనరాజు, పౌరసరఫరాల సంస్థ మేనేజర్​త్రినాథ్, పౌర సరఫరాల అధికారి రుక్మిణి, డీసీఓ వెంకటేశ్వర్లు, డీఏఓ అభిమన్యుడు పాల్గొన్నారు.

హార్టికల్చర్​ఆఫీసర్లపై అసహనం

గోద్రెజ్​కంపెనీ ప్రతినిధులతోపాటు హార్టికల్చర్​ఆఫీసర్లపై కలెక్టర్ ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. పామాయిల్​మొక్కల సాగు, లక్ష్యంపై హార్టికల్చర్​, అగ్రికల్చర్, గోద్రెజ్, ఆయిల్​ఫెడ్​ఆఫీసర్లతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అక్టోబర్​ నెల వరకు 8,400 మొక్కలు నాటాల్సి ఉండగా 7,147 మొక్కలే నాటడంపై అసహనం వ్యక్తం చేశారు. మిగిలిన మొక్కలను నెలాఖరులోగా నాటాలని ఆదేశించారు.

రైతులు ఆసక్తి చూపడం లేదంటూ ఆఫీసర్లు ఇచ్చిన సమాధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కారణాలు చెప్పొద్దని, క్షేత్ర స్థాయిలో రైతులతో మాట్లాడితే ప్రగతి కనిపిస్తుందన్నారు. పామాయిల్​సాగులో అంతర పంటల వేసేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అగ్రికల్చర్​జిల్లా ఆఫీసర్ అభిమన్యుడు, హార్టికల్చర్​జిల్లా ఆఫీసర్​జినుగు మరియన్న తదితరులు పాల్గొన్నారు.