హనుమకొండ, వెలుగు : హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జునస్వామి జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, హనుమకొండ అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా ఆదేశించారు. ఈ నెల 13 నుంచి మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండడంతో క్యూ లైన్లు, టికెట్ కౌంటర్లు, తాగునీరు, టాయిలెట్లు, వాహనాల పార్కింగ్, శానిటేషన్, విద్యుత్, బందోబస్త్ ఏర్పాట్లను బుధవారం వారు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ అన్ని శాఖల ఆఫీసర్లు కోఆర్డినేషన్‌తో పనిచేసి ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సమీపంలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ సహకారంతో 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సమీపంలోని చెరువులు, కుంటల వద్ద ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అంతకుముందు ఈవో అద్దంకి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వారి వెంట కాజీపేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, సీఎంహెచ్‌వో డాక్టర్ రాజేశ్‌కుమార్, డీఈ సంజయ్‌కుమార్, కుడా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అజిత్‌రెడ్డి, ఐనవోలు తహసీల్దార్ విక్రమ్‌కుమార్ పాల్గొన్నారు.