ప్రజావాణికి వినతుల వెల్లువ

ప్రజావాణికి వినతుల వెల్లువ

మంచిర్యాల, వెలుగు : లోక్​సభ ఎన్నికల కోడ్​ ముగియడంతో కలెక్టరేట్లలో గ్రీవెన్స్ సెల్​ సోమవారం తిరిగి ప్రారంభమైంది. సమస్యల పరిష్కారానికి బాధితులు గ్రీవెన్స్​కు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మంచిర్యాలలో ఆర్డీవోలు రాములు(మంచిర్యాల), హరికృష్ణ (బెల్లంపల్లి)తో కలిసి అడిషనల్​కలెక్టర్ (లోకల్ బాడీస్​)రాహుల్ అర్జీలు స్వీకరించారు. 50కిపైగా అప్లికేషన్లు రాగా, ఇందులో భూ సమస్యలకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. గ్రీవెన్స్​లో వచ్చిన వినతులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఆదిలాబాద్​టౌన్ : ఆదిలాబాద్​కలెక్టరేట్​లో  సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వివిధ మండలాల నుంచి వచ్చిన వారి నుంచి 62 అర్జీలను కలెక్టర్ రాజర్షిషా స్వీకరించారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్ శ్యామల దేవి, జిల్లా అధికారులు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

ఆసిఫాబాద్ : ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్​ దాసరి వేణు తెలిపారు. కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో  కాగజ్ నగర్ ఆర్డీఓ సురేశ్ తో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించే దిశగా సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని సూచించారు.

నిర్మల్ : ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని నిర్మల్ కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను ఆయన స్వీకరించారు. ధరణి, రెవెన్యూ, వ్యవసాయం, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, భూ సమస్యల వంటి అంశాలపై ఫిర్యాదులు అధికంగా వచ్చాయని,  సంబంధిత శాఖల అధికారులు దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, డీఆర్ఓ భుజంగ్ రావు, ఆర్డీఓ రత్నాకల్యాణి, జిల్లా అధికారులు 
పాల్గొన్నారు.

  •     మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోనంపేటకు చెందిన పలువురు గిరిజన రైతులు పుప్పాలవానిపేట శివారులోని తమ భూమిలో సీఎం గిరివికాస స్కీమ్​కింద బోర్లు వేశారు. కోనంపేట గ్రామానికి వచ్చే త్రీఫేస్​ కరెంట్​ లైన్​ నుంచి బోర్లకు కనెక్షన్​ ఇచ్చేందుకు ఎస్టిమేషన్​ వేసి డీఆర్డీఓ ద్వారా డబ్బులు చెల్లించారు. కానీ, మధ్యలో రిజర్వ్​ ఫారెస్ట్ ఉండడంతో లైన్​ వేయడానికి అధికారులు పర్మిషన్ ఇవ్వడం లేదు. దీంతో కన్నెపల్లి మండలంలోని రెబ్బన నుంచి కరెంట్ కనెక్షన్​ఇప్పించాలని సదరు రైతులు విన్నవించారు. 
  •     ఆసిఫాబాద్​జిల్లా జైనూర్ మండలం భూషిమెట్ట గ్రామానికి చెందిన దుర్పతబాయి తన పేరిట అటవీ హక్కు పత్రాలున్నా.. రైతుబంధు రావడం లేదని దరఖాస్తు అందజేశారు. 
  •     జైనూర్ మండలం ఆశపల్లికి చెందిన రాథోడ్ గుణవంత్ రావు 2012 డీఎస్సీలో ఎంపికైన తనకు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇప్పించాలని దరఖాస్తు అందజేశారు. 

పురుగుల మందు డబ్బాతో ప్రజావాణికి..

బెల్లంపల్లి రూరల్, వెలుగు: మామిడి పంటకు ఐకేపీ సెంటర్ డబ్బులు ఇవ్వకపోవడంతో  ఓ రైతు పురుగుల మందు డబ్బాతో ప్రజావాణికి రావడం కలకలం రేపింది. నెన్నెల ఎంపీడీవో ఆఫీస్ సోమవారం ఈ ఘటన జరిగింది. పంట అమ్మి నెల రోజులైనా డబ్బు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఎంపీడీవో దేవేందర్​రెడ్డికి చిత్తాపూర్​గ్రామానికి చెందిన రామడుగు జనార్దన్ ఫిర్యాదు చేశారు. తక్షణమే డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానన్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని అధికారి హామీ ఇవ్వడంతో వెనుదిరిగి వెళ్లాడు.