వరద ప్రాంతాల్లో కలెక్టర్​ పర్యటన

వరద ప్రాంతాల్లో కలెక్టర్​ పర్యటన

మెదక్, వెలుగు: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదివారం కలెక్టర్​ రాహుల్​రాజ్, మెదక్​ మున్సిపల్ చైర్మన్​చంద్రపాల్ తో కలిసి మెదక్​ పట్టణ, పరిసర ప్రాంతాల్లో పర్యటించారు.  రాయన్నపల్లి, పాతూరు మధ్యలో రోడ్డుపై వరద నీటి ప్రవాహాన్ని, మెదక్ - రామాయంపేట్ రోడ్ లో కొత్తగా నిర్మించిన బ్రిడ్జి వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. విపత్కర పరిస్థితిని ఎదుర్కొకునేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు సెలవులు రద్దు చేశామని 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని  ఆదేశించారు.

సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించామన్నారు. వర్షాల సమయంలో విష జ్వరాలు ప్రబలకుండా వైద్యఆరోగ్య శాఖ చర్యలు చేపట్టాలన్నారు.  ప్రజలు ఎవరూ అవసరం లేకుండా బయటకు రావొద్దని సూచించారు. ప్రభుత్వం, విపత్తు నిర్వహణ శాఖ అలర్ట్ మెసేజ్‌లు గమనించి తగిన రక్షణ చర్యలు తీసుకుంటుందన్నారు. 

సంగారెడ్డి టౌన్​: భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దుతో పాటు విద్యా సంస్థలకు  సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ క్రాంతి తెలిపారు. ప్రజలు అత్యవసర పరిస్థితులల్లో  కలెక్ట​ రేట్​లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నంబర్​08455-267155 కు ఫోన్​చేసి సాయం కోరవచ్చన్నారు.