పార్కింగ్ కు ​పకడ్బందీ చర్యలు చేపట్టాలి : కలెక్టర్ ​రాహుల్ ​రాజ్

పార్కింగ్ కు ​పకడ్బందీ చర్యలు చేపట్టాలి : కలెక్టర్ ​రాహుల్ ​రాజ్

మెదక్​టౌన్, వెలుగు : ఏడుపాయల జాతరలో పార్కింగ్ నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్​ రాహుల్​రాజ్​అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన మెదక్​ కలెక్టరేట్ లో  జాతర ఏర్పాట్లపై అడిషనల్​ కలెక్టర్ నగేశ్, దేవాదాయ, పోలీస్, జీపీ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. భక్తులకు అసౌకర్యం కలగకుండా అమ్మవారిని దర్శించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. 

జాతరలో సింగల్ యూజ్​ ప్లాస్టిక్ నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయలన్నారు. అనంతరం జాతర పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్​, డీపీవో యాదయ్య, ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి, సంబంధిత పోలీస్, దేవాదాయ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

జీపీ ఎన్నికల్లో స్టేజ్​-2 ఆఫీసర్ల పాత్ర కీలకం

గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో స్టేజ్ -2 అధికారుల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్​రాజ్​ అన్నారు. మెదక్​కలెక్టరేట్​లో స్థానిక ఎన్నికలకు సంబంధించి స్టేజ్​-2 రిటర్నింగ్ ఆఫీసర్ల శిక్షణా కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. జీపీ ఎన్నికల్లో స్టేజ్ - 2 అధికారులు కౌంటింగ్ చేసి ఫలితాలు ప్రకటించే ఆఫీసర్లుగా ఉంటారన్నారు.  పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు కౌంటింగ్ రోజు నిబద్ధతతో పని చేయాలని సూచించారు. 

పోలింగ్ కేంద్రాల్లో ఏవైనా సమస్యలు ఉంటే ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లి  పరిష్కరించుకోవాలన్నారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్​నగేశ్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీపీవో యాదయ్య, డీఈవో రాధాకిషన్​, డీఎస్​వో రాజిరెడ్డి, ఆర్డీవో రమాదేవి, స్టేజ్​-2 అధికారులు పాల్గొన్నారు.