
మెదక్, వెలుగు: కొల్చారం మండలంలోని రంగంపేట పీహెచ్సీని కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలోని ఓపీ వార్డు, ఐపీ వార్డు, ఏఎన్సీ క్లినిక్ ను తనిఖీ చేసి రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలు, రోగుల వివరాల గురించి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రం పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతిరోజూ ఫాగింగ్ చేయించాలని అధికారులను ఆదేశించారు.
వైద్యులు, నర్సులు, సిబ్బంది అటెండెన్స్, ఓపీ, ఐపీ, మందుల నిల్వల రిజిస్టర్లను పరిశీలించారు. ఓపీ సేవలను మరింతగా పెంచేందుకు కృషి చేయాలన్నారు. యాంటీబయోటిక్స్, పాము కాటు మందులు అందుబాటులో ఉంచాలని, రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు, నర్సులకు సూచించారు.