అర్జీలను వెంటనే పరిష్కరించి ప్రజల్లో నమ్మకం కల్పించాలి

అర్జీలను వెంటనే పరిష్కరించి ప్రజల్లో నమ్మకం కల్పించాలి

మెదక్​ టౌన్, వెలుగు: గ్రీవెన్స్​సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్​రాహుల్​రాజ్​అన్నారు. సోమవారం మెదక్​ కలెక్టరేట్​లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అడిషనల్​కలెక్టర్​నగేశ్​తో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. గ్రీవెన్స్ దరఖాస్తులను పరిష్కరించడంలో అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. 

సత్వర పరిష్కారం చూపి ప్రజలకు నమ్మకం కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా 34 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఇందులో ధరణి- 16, పెన్షన్ -3, ఉపాధి 2, ఇతర సమస్యలు 13 ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో పీడీ శ్రీనివాస్​రావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా వ్యాప్తంగా 60 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్​క్రాంతి తెలిపారు. అడిషనల్​కలెక్టర్ చంద్రశేఖర్, ట్రైనీ కలెక్టర్ మనోజ్, డీఆర్​వో పద్మజారాణి, ఆర్డీవో రవీందర్ రెడ్డితో కలిసి కలెక్టర్​ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి మండలం పసల్వాదిలో నిర్మిస్తున్న డంపింగ్ యార్డ్ పనులను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు పట్నం మాణిక్యం ఆధ్వర్యంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

 సంగారెడ్డి మున్సిపల్ పరిధిలోని బైపాస్ రోడ్డు సర్వే నెంబర్ 374 బై 1లో ఉన్న స్థలానికి అక్రమంగా ఐదు ఇంటి నెంబర్లను కేటాయించి నిర్మాణాలు చేపడుతున్నారని దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టెలికాం బోర్డు అడ్వైజరీ కమిటీ సభ్యుడు ప్రసాది రవిశంకర్, బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు రమేశ్, వాసు, నాగరాజు, పార్టీ పట్టణ అధ్యక్షుడు రవి కలెక్టర్ ను కోరారు.  

సిద్దిపేట టౌన్: ప్రజావాణిపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ లో అధికారులతో కలిసి ఆయన అర్జిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ప్రజావాణికి 62 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఇందులో ధరణి, డబుల్​బెడ్​రూం, ఆసరా పింఛన్లు తదితర సమస్యలు ఉన్నాయన్నారు. 

ALSO READ : వరి కొయ్యలకు నిప్పుతో.. పెరుగుతున్న పొల్యూషన్​

ములుగు మండలం మామిడ్యాల గ్రామానికి చెందిన కొండపోచమ్మ ప్రాజెక్ట్ ముంపు బాధితులు తమకు పరిహారం అందించి న్యాయం చేయాలని కోరుతూ అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ హామీ మేరకు పింఛన్​రూ.6వేలకు పెంచాలని అడిషనల్​కలెక్టర్​ను కోరారు. కార్యక్రమంలో డీఆర్​వో నాగరాజమ్మ, డీఆర్డీవో జయదేవ్ ఆర్యా, అధికారులు పాల్గొన్నారు.