సర్కార్​ దవాఖానాలపై స్పెషల్ ఫోకస్

సర్కార్​ దవాఖానాలపై స్పెషల్ ఫోకస్
  • వైద్య సేవల మెరుగుకు ఆకస్మిక తనిఖీలు
  • విధుల్లో నిర్లక్ష్యం చేసిన నలుగురు సిబ్బంది సస్పెండ్
  • ఉద్యోగాల నుంచి ముగ్గురి తొలగింపు,  ఒక డాక్టర్ కు చార్జి మెమో

మెదక్, వెలుగు: జిల్లాలోని గవర్నమెంట్ దవాఖానల్లో డాక్టర్లు, సిబ్బంది పనితీరు మెరుగుపరిచి, జవాబుదారీతనం పెంచేలా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆయా మండలాల హాస్పిటల్స్ లో ఆకస్మిక పర్యటనలు చేస్తున్నారు.  పేద, మధ్యతరగతి ప్రజలు చికిత్స కోసం సర్కారు దవాఖానాలకు రావడాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రమైన మెదక్‌‌లో  ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్), నర్సాపూర్ లో ఏరియా హాస్పిటల్, రామాయంపేట​, తూప్రాన్​, కౌడిపల్లిలో కమ్యూనిటీ హెల్త్​ సెంటర్ (సీహెచ్​సీ)లు, వివిధ  మండలాల పరిధిలో 19 ప్రైమరీ హెల్త్​ సెంటర్​(పీహెచ్​సీ)లు, మెదక్​ పట్టణంలో అర్బన్​ ప్రైమరీ హెల్త్​ సెంటర్ (యూ పీహెచ్​సీ) ఉన్నాయి.

  ఆయా చోట్ల డాక్టర్లు, సిబ్బంది సమయ పాలన పాటించడం లేదని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్​ తరచుగా పెద్దాసుపత్రులను తనిఖీ చేయడంతో పాటు, మండల పర్యటనకు వెళ్లినపుడు విధిగా ప్రైమరీ హెల్త్​ సెంటర్లను తనిఖీ చేస్తున్నారు. అటెండెన్స్​ రిజిస్టర్​లు తనిఖీ చేసి డాక్టర్లు, సిబ్బంది డ్యూటీలో ఉన్నారా లేదా అనేది పరిశీలిస్తున్నారు.  ఫార్మసీని తనిఖీ చేసి అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా.. లేదా అనే విషయం గమనిస్తున్నారు.

దవాఖానాలో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ పాటించాలని సూచిస్తున్నారు.  సమయ పాలన పాటించాలని, చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లు, సిబ్బందిని ఆదేశిస్తున్నారు.    ​ 

ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు

డాక్టర్లు, సిబ్బంది అందరూ కచ్చితంగా సమయ పాలన పాటించాలని, ఆసుపత్రులకు వచ్చే రోగుల పట్ల మర్యాదగా మెలగడంతో పాటు, మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్​ సూచిస్తున్నారు.  విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరిస్తున్నారు. 

నిర్లక్ష్యం చేసే వారిపై వేటు 

ఆకస్మిక తనిఖీల సందర్భంగా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వైద్యాధికారులు, సిబ్బందిపై కొరడా ఝులిపిస్తున్నారు. ఇప్పటికే రెండు దవాఖానాల్లో ఏడుగురిపై వేటు వేశారు. గత నెల 31న తేదీన కలెక్టర్​ రాహుల్ రాజ్​ కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్​సీ)ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ రోజు డ్యూటీకి గైర్హాజరైన మెడికల్ ఆఫీసర్​ డాక్టర్​రమేశ్ కు మెమో జారీ చేయగా, సీనియర్​అసిస్టెంట్​శ్రీనివాస్ గౌడ్‌‌ను డీఎంహెచ్‌‌వో సస్పెండ్ చేశారు.

 ఆయుష్​ మెడికల్​ఆఫీసర్​డాక్టర్​హర్ష, కాంపౌండర్​రజిత, సపోర్టింగ్​ స్టాఫ్​పెంటయ్యలను ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ నెల 17వ తేదీన కలెక్టర్​కౌడిపల్లి పీహెచ్‌‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఆసుపత్రిలో అటెండెన్స్​ రిజిస్టర్‌‌‌‌ను పరిశీలించగా మల్టీ పర్పస్​ హెల్త్​అసిస్టెంట్లు రమేశ్, రాధాకృష్ణ, ఎంపీహెచ్​ఈఓ అబ్దుల్ షకీల్ రిజిస్టర్​లో సంతకం చేసి విధులకు హాజరు కానట్టు గుర్తించారు.  దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన విధుల పట్ల బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్న ఆ ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేయాలని డీఎంహెచ్​ఓను ఆదేశించారు. ఈ మేరకు ఆయన వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు.