ఆసుపత్రుల గురించి తప్పుడు వార్తలు రాస్తే చర్యలు : కలెక్టర్ రాహుల్ రాజ్

ఆసుపత్రుల గురించి తప్పుడు వార్తలు రాస్తే చర్యలు : కలెక్టర్ రాహుల్ రాజ్

 నర్సాపూర్, వెలుగు : ప్రభుత్వ ఆసుపత్రులపై అసత్య వార్తలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తే  కఠిన చర్యలు తీసుకుంటామని  జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. బుధవారం నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా పరిశీలించారు. ఆసుపత్రి లోని అన్ని వార్డులు తిరిగారు. సిబ్బంది, హాజరు పట్టికలు, స్టాక్ రిజిస్టర్లు ‌‌, రోగులు చికిత్స పొందే వార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..  మందులు లేక రోగుల అవస్థలు అంటూ తప్పుడు వార్తలు వ్యాప్తి చేయడం తగదన్నారు.

  దీనిపై ఆసుపత్రిని ఆకస్మికంగా పరిశీలించగా అది తప్పని తేలిందన్నారు.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది విధి నిర్వహణపై నిఘా ఏర్పాటు  ద్వారా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నుంచి పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.  డాక్టర్ల మనోధైర్యం దెబ్బతినే విధంగా అసత్య ప్రచారాలు చేస్తే ఇకపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.  కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ పావని సంబంధిత వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.