నిజాంపేట, వెలుగు: గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేసే పొలిటికల్ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆర్డీవోల పర్మిషన్ తీసుకుని ప్రచారం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. సోమవారం ఆయన మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. మండలానికి ఒక పోలింగ్ స్టేషన్ చొప్పున జిల్లాలో గ్రాడ్యుయేట్లకు 22, టీచర్లకు 22 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని చెప్పారు.
పోలింగ్ స్టేషన్ లలో తాగునీరు, టాయిలెట్స్, పోలింగ్ రూమ్ లలో ఫ్యాన్స్, లైటింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కరీంనగర్ లో నామినేషన్ల ప్రక్రియ మొదలైందని ఈ ప్రక్రియ ముగియగానే జిల్లాలో ఎన్ని బ్యాలెట్ పేపర్లు అవసరమో ప్రింటింగ్ కు పంపిస్తామని, అవసరమైన బ్యాలెట్ బాక్స్ లను సిద్ధం చేస్తామని కలెక్టర్ వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ సురేశ్ కుమార్ ఉన్నారు.