గుడిహత్నూర్, వెలుగు: నాగోబా జాతరను ఆదివాసులు, అధికారులు సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. గురువారం ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్‌లోని ప్రసిద్ధ నాగోబా ఆలయాన్ని ఐటీడీఏ పీఓ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి సందర్శించారు. ముందుగా పీఓతో కలిసి నాగోబాకు పూజలు చేసిన అనంతరం ఆలయ ఆవరణలోని దర్బార్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు.
జాతరకు చేస్తున్న ఏర్పాట్ల వివరాలను తెలుసుకున్నారు. నాగోబా పూజల్లో ప్రధాన పాత్ర వహించే మెస్రం వంశీయులు బసచేసే ఆలయ ఆవరణలోని మర్రి చెట్టు, గోవాడ వద్ద తాగునీరు, సరిపడా టాయిలెట్స్, బాత్రూమ్స్ ఏర్పాటు చేసి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలన్నారు.
జాతరకు ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అవాంచనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని పోలీసు అధికారులకు సూచించారు. సమావేశంలో ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్, స్థానిక సర్పంచ్ రేణుక,ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్, ఈఓ రాజమౌళి, మెస్రం వంశస్థులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.