- ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ
- మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ టౌన్, వెలుగు : మెదక్ జిల్లా వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక సర్వేలో ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తగా వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని జూనియర్‌కాలేజీ ఆవరణలో సామాజిక, ఆర్థిక సర్వే ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు మండల స్థాయి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించగా కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర సర్వే పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.
ఈ సర్వే పారదర్శకంగా ఉండాలని, సర్వే విషయాలను గోప్యంగా ఉంచాలన్నారు. ఎలాంటి తప్పులు లేకుండా సర్వే పక్కా గా చేయాలని, ఏ ఒక్క విషయం తప్పిపోకుండా అన్ని వివరాలు సేకరించాలన్నారు. మెదక్ మండలంలో 172 మంది ఎన్యుమరేటర్లకు,16 మంది సూపర్వైజర్లకు అవగాహన కల్పించామన్నారు. ఎన్యుమరేషన్ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇంటి నెంబర్ ఆధారంగా సర్వే ఉంటుందని, ఆధార్ కార్డు ప్రకారం తప్పకుండా వివరాలు నమోదు చేయాలన్నారు. నవంబర్ 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు గృహాల లిస్టింగ్ చేసుకొని నవంబర్ 6వ తేదీ నుంచి సర్వే ప్రారంభించాలని కలెక్టర్ రాహుల్ రాజ్శిక్షణ కార్యక్రమంలో వివరించారు. మెదక్ తహసీల్దార్ లక్ష్మణ్‌బాబు, అధికారులు ప్రవీణ్‌రెడ్డి, సంబంధిత ఎన్యుమరేటర్లు సూపర్వైజర్లు పాల్గొన్నారు.