భూభారతితో భూములకు భరోసా : కలెక్టర్ ​రాహుల్​రాజ్​

భూభారతితో భూములకు భరోసా : కలెక్టర్ ​రాహుల్​రాజ్​

కొల్చారం, కౌడిపల్లి, వెలుగు: భూభారతితో భూములకు భరోసా లభిస్తుందని కలెక్టర్​రాహుల్​రాజ్​అన్నారు. ఆదివారం ఆయన కొల్చారం, కౌడిపల్లి మండలాల్లో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం మేధావుల అభిప్రాయాలు, సూచనలతో భూభారతి చట్టాన్ని రూపొందించిందన్నారు. ఈ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. భూభారతి చట్టం ద్వారా ఆర్డీవో, కలెక్టర్ సత్వరమే భూముల సమస్యను పరిష్కరించే అవకాశం ఉందన్నారు. భూమి సర్వే నెంబర్, సరిహద్దులు ఏర్పాటు చేసి భూదార్ నెంబర్ ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన నీరుడి పోచయ్య రెవెన్యూ సదస్సుకు వచ్చిన అధికారులు రాజకీయ నాయకుల ఇళ్లల్లో భోజనాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. గ్రామ సభకు అయ్యే ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరించాలని అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. ఆయా సమావేశాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్​పర్సన్​సుహాసిని రెడ్డి, డీఈవో రాధాకిషన్​, ఆర్డీవో మహిపాల్​ రెడ్డి, వ్యవసాయాధికారి పుణ్యవతి, తహసీల్దార్​గఫార్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.