ధాన్యం కొనుగోలుకు టాస్క్​ఫోర్స్​ : కలెక్టర్​ రాహుల్​ రాజ్​

ధాన్యం కొనుగోలుకు టాస్క్​ఫోర్స్​ : కలెక్టర్​ రాహుల్​ రాజ్​
  • జిల్లా వ్యాప్తంగా 387 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

మెదక్​టౌన్, వెలుగు: మెదక్​ జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల పర్యవేక్షణకు టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా  387 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా టోల్​ ఫ్రీ నెంబర్​ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మంగళవారం మెదక్​లోని కలెక్టరేట్‌‌లో జిల్లాలోని వ్యవసాయ శాఖల,  సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్​ రాహుల్​ రాజ్​ మాట్లాడుతూ..  మెదక్​ జిల్లాలో రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు.  క్వింటాలుకు గ్రేడ్- ఏ రకానికి రూ.2,320 , సాధారణ రకానికి రూ.2,300  ధర ఉందన్నారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాల వద్ద  సమస్యలను పరిష్కరించడానికి  కలెక్టరేట్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ 9281103685 నంబర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్​ రాహుల్​రాజ్ వివరించారు.  అక్టోబర్ మూడో వారం నుంచి కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు  తెలిపారు. దీంతో పాటు జిల్లాలో 109 రైస్​మిల్లులకు గాను 66 మిల్లులను బ్లాక్​లిస్టులో పెట్టామని... జిల్లాలో 43 మిల్లులకు మాత్రమే  1 లక్ష  40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు కేటాయిస్తామని చెప్పారు. సమీక్ష సమావేశంలో జిల్లా అడిషనల్​ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్​డీవో శ్రీనివాస్​, సివిల్​ సప్లయి డీఎం హరికృష్ణ, జిల్లా పౌరసరఫరాల అధికారి సురేశ్ఊ రెడ్డి, లీగల్ మెట్రాలజీ అధికారి సుధాకర్, డీసీవో కరుణ, మార్కెటింగ్, రవాణా, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.