మహాలక్ష్మి అప్లికేషన్ల సవరణకు సర్వే : కలెక్టర్​ రాహుల్​రాజ్

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు; ప్రజాపాలనలో భాగంగా మహాలక్ష్మి పథకం కోసం వచ్చిన దరఖాస్తుల్లో తప్పులను సవరించేందుకు ప్రత్యేక సర్వే బృందాలను నియమించినట్టు కలెక్టర్​ రాహుల్​ రాజ్​ అన్నారు. బుధవారం తలమడుగు మండలం భరంపూర్ లో ఆయన పర్యటించారు. మహాలక్ష్మి పథకం దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ దరఖాస్తులను వెరిఫై చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్​  రూపొందించిందని చెప్పారు. ఈ యాప్ సహాయంతోనే దరఖాస్తు దారుల వివరాలను సరి చేస్తామన్నారు.  

ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించగా.. పలువురు పూర్తి వివరాలను సమర్పించలేదని  తెలిసిందన్నారు. వాటిని సరిచేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.  సర్వే బృందాలు ఫిబ్రవరి 10వ తేదీ వరకు గ్రామాల్లో పర్యటిస్తాయని అన్నారు.  అనంతరం గ్రామంలో నిర్వహిస్తున్న శానిటేషన్​ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమాకాంత్, అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.