
మెదక్ టౌన్, వెలుగు: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలో మెనూ ప్రకారం భోజనం అందించడం అభినందనీయమని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఆదివారం మెదక్ మండలంలో రైల్వే స్టేషన్ సమీపంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.
ముందుగా వంట సామగ్రిని పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడి భోజన వివరాలపై ఆరా తీశారు. విద్యార్థులకు సమయానికి ఆహారం, నిద్ర అవసరమని అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని తద్వారా విద్యపై ఆసక్తి పెరుగుతుందన్నారు. కలెక్టర్ వెంట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.
ప్రజావాణిలో హెల్ప్‌డెస్క్‌తో దరఖాస్తులు
మెదక్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులకు ఆయా శాఖల అధికారులకు ఎన్నికల విధులు కేటాయించామని ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం కలెక్టరేట్లో దరఖాస్తులను హెల్ప్‌డెస్క్ ద్వారా స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్‌తెలిపారు. ప్రజలందరూ గమనించి కలెక్టరేట్ హెల్ప్ డెస్క్ లో అర్జీలను అందించాలని
సూచించారు.
ప్రజాపాలన కేంద్రాల్లో సమాచారం అందించాలి
సమగ్ర ఇంటింటి సర్వేలో నమోదు చేసుకోని వారు ప్రజాపాలన కేంద్రాల్లో సమాచారం అందజేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఆదివారం మెదక్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆదివారం అయినప్పటికీ ప్రజాపాలన సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో పాల్గొనని వారికి మరొక అవకాశం కల్పించామన్నారు.
టోల్ ఫ్రీ నెంబర్ 040- 21111111 కు, ఎంపీడీవో, మున్సిపల్ ఆఫీసులోని ప్రజాపాలన సేవా కేంద్రాల్లో వివరాలు నింపిన తర్వాత వాటిని ప్రజాపలన కేంద్రాల్లో ఇచ్చి తమ వివరాలు నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్ వెంట మెదక్ ఎంపీడీవో రఘు, సంబంధిత పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.